Scientists మానవజాతి ఎలా అంతం కాబోతుందో తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు
Scientists మానవజాతి ఎలా అంతం కాబోతుందో తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు:భూగ్రహం మీదకు జీవజాతుల ఎలా వచ్చాయి.? అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నవి అంచనాలే. వాస్తవంలో ఎలా జీవుల పుట్టుక సాధ్యమైందో తెలియదు. అదే మాదిరి..
భూమి మీద నుంచి జీవరాశులు ఎలా అంతరించిపోతాయి.?. ఈ విషయంపై పరిశోధిస్తే.. ఓ వైపు ఆశ్చర్యం, మరోవైపు భయం కలుగకమానదు. మరీ ముఖ్యంగా.. మనిషి ఎప్పుడు ఈ భూ గ్రహం నుంచి తుడిచిపెట్టుకుని పోతాడు అంటే.. దానికీ ఓ సమయం, సందర్భం ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి మీద నుంచి డైనోసార్లు అంతరించిపోయినట్లు మనిషి ఎప్పుడు.. అంతర్దానం అవుతాడు అనే విషయాల గురించి శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటంటే.. ?
మనకి తెలియని జీవులు
కొన్ని కోట్లు భూమి మీద నిత్యం అనేక జీవులు వస్తుంటాయి. వెళుతుంటాయి. మరి అన్నింటి కంటే తెలివైన మనిషి ఎప్పుడు ఇక్కడి నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతాడు, అందుకు ఎలాంటి పరిణామాలు కారణమవుతాయి అనే అంశాలపై బ్రిస్టల్ యూనివర్శిటీలో సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ డా. అలెగ్జాండర్ ఫార్న్స్‌వర్త్ నేచర్ నేతృత్వంలో కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. సూపర్ కంప్యూటర్ విశ్లేషణల్ని వినియోగించుకుని.. వారు చేసిన అంచనాలు ఇప్పుడు.. ఆసక్తి కలిగిస్తున్నాయి.
జీవుల పుట్టుక, గిట్టుక ఆసక్తికరమే
ఇప్పటికీ.. ఈ జీవ పుట్టుక, అంతర్ధానం ప్రక్రియలను అంచనా వేయడం అంత సులువు కాదు. ఎందుకంటే.. ఇప్పటి వరకు మనిషికి తెలిసి కేవలం 1.9 మిలియన్ల జీవులనే గుర్తించారు. ఇది కేవలం 20 శాతమే. ఇంకా మనకు తెలియని 75 శాతం జీవులు ఈ భూమి మీద జీవిస్తున్నాయి. శాస్త్రవేత్తల విస్త్రత పరిశోధన కారణంగా.. ఏటా 13 వేలకు పైగా నూతన జీవులను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. వారికి అంతుచిక్కనివి కొన్ని కోట్లు. ఇదే ఓ ఆశ్చర్యం అంటే, ఇదే తరహాలో నిత్యం కొన్ని జీవులు మన భూ గ్రహం మీద నుంచి పూర్తిగా అంతరించిపోతున్నాయి అన్న సంగతి మీకు తెలుసా..? మనకు తెలిసింది.. మముద్ ఏనుగులు డైనోసార్లు ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు వాటి బాటలో రాబంధులు, పులులు, గుడ్ల గూడలు, ఖడ్గ మృగాలు ఇలా చాలా కొన్ని మాత్రమే మనకి తెలిసినవి. మరి తెలియనివి మరెన్నో… వాటి జాబితాలో మనిషి కూడా చేర్చిన ఈ పరిశోధన.. అందుకు ఎంత సమయం పడుతుందో కూడా అంచనా వేసింది.
కొత్త గ్రహం వస్తుంది.
భూమి వయసు కొన్ని బిలియన్ ఏళ్లు. భూమి అనే గ్రహం ఏర్పడినప్పటి నుంచి అనేక మార్పు చేర్పులకు గురవుతూ… ఇప్పటి స్థితికి చేరుకుంది. ఆ పరిణామాలు ఇప్పటికీ ఆగవు.. నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అలా.. భూమి మార్పుల్లో మనకు ఆసక్తి కలిగించేది.. ఖండాల నిర్మాణం. ప్రస్తుతం మనం చూస్తున్న 7 ఖండాలు.. ప్రారంభంలో లేవని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. మన భారత భూభాగం అయితే.. ఇప్పటి ఆఫ్రికా ఖండం నుంచి విడిపోయి.. హిమాలయ ప్రాంతంలో ఆసియా ఖండాన్ని ఢీ కొట్టింది. ఈ కారణంగా.. అత్యంత ఎత్తైన హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ.. హిమాలయాల ఎత్తు పెరుగుతూనే ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఫలకాల కదలికలే.. మానవ జాతిని నాశనం చేసే ప్రక్రియలో కీలకం అంటున్నారు. ఇప్పుడున్న ఖండాలన్నీ కదిలిపోయి..నూతనంగా పాంజియా అల్టిమా అనే సూపర్ ఖండం ఏర్పాటు కానుంది.
మనిషి అంతరించే ముందు సంకేతాలు
ప్రస్తుత భూ గ్రహం మీద అత్యంత తెలివైన జీవిగా ఉన్న మనిషి, ఇతర కొన్ని క్షీరదాలు.. ఈ గ్రహం మీద నుంచి ఎలా నిష్క్రమిస్తాయనే విషయమై.. అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. ఎంతో ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. సూపర్ కంప్యూటర్ క్లైమెట్ మోడల్స్ వినియోగించిన శాస్త్రవేత్తలు.. ఈ పాంజియా అల్టిమా ఖండంలోని వాతావరణాన్ని అంచనా వేసింది. దీని ప్రకారం.. ఈ గ్రహం అత్యంత వేడిగా, అత్యంత పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది.
ఈ కారణంగానే.. మనిషి, కొన్ని క్షీరదాలు పూర్తిగా ఆ వాతావరణానికి తట్టుకోలేక అంతరించిపోతారు అంట. అలాగే.. ఈ పరిస్థితులకు కారణాలను అంచనా వేసిన శాస్త్రవేత్తలు.. ఇందుకు కాంటినెంటల్ ఎఫెక్ట్, రానున్న మిలియన్ ఏళ్లల్లో అత్యంత వేడిగా మారనున్న సూర్యుడు, భూ వాతావరణంలో పెరిగిపోయే కార్బన్ డైయాక్సైడ్ పరిమాణాలే ప్రధాన కారణంగా తేల్చారు.
భూమిపై నీళ్లు దొరకవు
ఖండాలన్నీ కలిసిపోవడంతో.. పెద్ద నీటి సరస్సుల దగ్గర ఉష్ణోగ్రతలకు, ఇతర ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలకు సంబంధం ఉండదని అంటున్నారు. ఈ కారణంగా.. వేడి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, పెరిగిన కార్బన్ డై ఆక్సైడ్ తో చాలా జీవులు.. అందుకు తగ్గట్లు మారలేక అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగిపోయే ప్రక్రియ కాదని వివరించిన శాస్త్రవేత్తల బృందం.. ఇలా జరిగేందుకు మరో మిలియన్ సంవత్సరాలు, అంటే 10 లక్షల ఏళ్లు, లేదా అంత కంటే ఎక్కువ పట్టొచ్చని అంటోంది.
అంతరిక్ష, గ్రహ కాలాల్లో.. ఇది చాలా తక్కువ సమయమే. అయితే.. ప్రస్తుత పరిణామాలు, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, గాలి కాలుష్యం.. వాటికి గుర్తులని హెచ్చరిస్తున్నారు. అందుకే.. మనషి తన అవసరాలకు మించి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను ఆపివేయాలని కోరుతున్నారు. కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుదలకు.. రానున్న కాలంలో భూమిపై ఉన్న అగ్నిపర్వతాల విస్పోటనాలు ప్రధాన కారణాలుగా నిలువనున్నాయి.
గాలి కాలుష్యమే.. అంతం చేస్తుంది
ప్రస్తుతానికి మిలియన్ కు 400 భాగాలుగా ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు.. రాబోయే సంవత్సరాల్లో 600 PPP లకు పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తల బృందం అంచనాకు వచ్చింది. అందుకు ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ కార్యకలాపాలే అతిపెద్ద కారణంగా తేల్చింది. మానవాళి భవిష్యత్తును కాపాడుకోవాలంటే కార్బన్ డైయాక్సైడ్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేయాలని.. మానవుడే ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది .
ఇప్పటికే.. ధృవాల్లోని మంచు వేగంగా కలిరిపోతూ.. సముద్రమట్టాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగానే.. సమీపంలోనే సముద్రం వెంట ఉన్న భారీ నగరాలు పూర్తిగా నీట మునుగుతాయనే అంచనాలున్నాయి. ఈ పరిస్థిత్తుల్లోనూ మనిషి ప్రవర్తన, తీరు మారకపోతే.. మరిన్ని అనర్థాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.